About Me

My photo
Stubborn but considerative... Sensitive but Sensible enough.. Childish but Caring... Over all, I'm me, truly, rightly, strictly, genuinely ME!

Monday, September 13, 2010

ఏది మంచిది?

మొన్న మా ఆఫీసులో ఒక ట్రైనింగ్ batch జాయిన్ అయ్యింది. వాళ్లకి లంచ్ దాకా ప్రాసెస్ ట్రైనింగ్ ఇచ్చి , లంచ్ తర్వాత నుంచి జస్ట్ ఏవో డిస్కషన్ పెడుతున్నాం. మొన్న కూడా అలానే ఒకటి పెట్టాం. దేని మీదా అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం మంచిదా, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం మంచిదా అని.

పెళ్ళిళ్ళు అయ్యిన వాళ్ళేమో మంచిగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడమే మంచిది అన్నారు. పెళ్లి కాని వాళ్ళేమో ప్రేమించి పెళ్లి చేసుకుంటే పెళ్లి తర్వాత కొంచెం స్మూత్ గా ఉంటుంది లైఫ్ అన్నారు. పెళ్లి కాని వాళ్ళల్లో కూడా కొంత మంది పెద్దలు కుదిర్చిన పెళ్లిని సపోర్ట్ చేసారు అనుకోండి. కానీ చాలా వరకు ప్రేమించి పెళ్లి చేసుకోవడమే మంచిది అన్నట్లు మాట్లాడారు. నేను కాలేజీలో ఉండగా అనుకుంటా ఒకసారి ఇలాంటి టాపిక్ వస్తే అందరూ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడమే మంచిది అన్నారు. అంటే ఆ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని సపోర్ట్ చేస్తే..ఏంటీ...ఎవర్ని ఆయినా ప్రేమిస్తున్నావా అని అడిగే పరిస్థితి ఉండేది అనుకోండి అది వేరే సంగతి. కానీ ఈ రోజుల్లో పిల్లలకి లైఫ్ మీద తొందరగా క్లారిటీ వచ్చేస్తుంది. నిజంగా వస్తుందా లేకపోతే వచ్చింది అనే భ్రమలో బతుకుతున్నారా అనేది వేరే విషయం.

నిజమేనేమో ప్రేమించి పెళ్లి చేసుకుంటే అవతలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే విషయం ముందే తెలిసి ఉంటుంది, దానికి తగ్గట్టు గానే మన expectations కూడా సెట్ అయిపోయి ఉంటాయి. అయ్యో..ఎలాంటి లైఫ్ కోరుకున్నాం, ఇలాంటి లైఫ్ వచ్చింది అని భాధ పడే పరిస్థితి రాదు. కాకపోతే ఎప్పటికీ పరిస్థితి ఇలానే ఉంటే పర్లేదు...కానీ పెళ్లి అంటే ఇద్దరు కలిసి బతకడం మాత్రమే కాదు కదా...అటు వైపు వాళ్ళు, ఇటు వైపు వాళ్ళు కలవగలగాలి. పిల్లల సంతోషమే మా సంతోషం అనుకునే పెద్ద మనసు రెండు వైపుల వాళ్ళకి ఉండాలి, లేకపోతే అమ్మాయి వైపు వారు అల్లుడిని ఆదరించి, గౌరవించలేరు. అబ్బాయి అమ్మ, నాన్నలు కొడుకు దగ్గర నాలుగు రోజులు ఉండి వెళ్ళలేరు.

పెద్దలు కుదిర్చిన పెళ్లి మాత్రమే అన్ని రకాలుగా మంచిది అని కూడా చెప్పలేం.  అమ్మాయికి ఏవో ఊహలు ఉంటాయి..భర్త కి పెద్ద మనసు ఉండాలి, తనని అమితంగా ప్రేమించడమే కాదు, ఎప్పటికప్పుడు వెలిబుచ్చుతూ ఉండాలి, ఇలా ఉండాలి.. అలా ఉండాలి అంటూ పరిమితులు విధించకూడదు, ఎప్పటికప్పుడు surprises ఇస్తూ ఉండాలి,  భర్తనని అధికారం చూపించకూడదు... ఇలాంటివే ఇంకా ఏవో. అబ్బాయికి ఏమో అమ్మాయి అర్ధం చేసుకునేది అయి ఉండాలి, ఇంటికి వచ్చిన తర్వాత హాయిగా relax అవ్వనివ్వాలి, అత్త గారింట్లో అందరితో కలిసిపోవాలి, చిన్న చిన్న విషయాల్లో సర్దుకుపోవాలి, ఎక్కువ నస పెట్టకూడదు, మంచిగా వండి పెట్టాలి (ఈ రోజులలో అంత ఎక్కువ expect చెయ్యటం లేదు అనుకోండి), తగిన గౌరవం ఇవ్వాలి, ఇంట్లో ఎలా ఉన్నా బయటకి వెళ్ళినప్పుడు తన మాటకు ఎదురు చెప్పకుండా నడుచుకోవాలి..ఇలా.... అన్నీ మంచి లక్షణాలే...కానీ అందరిలో అన్నీ ఉండవుగా. ఏవి ఉంటాయి, వేటితో మనం సర్డుకుపోగలం, వేటిని అస్సలు భరించలేం అనేవి మనకు మనం తెలుసుకునే అవకాశం లేకుండానే పెళ్లి అయిపోతుంది. తర్వాత మనం అనుకున్నట్లు జీవితం లేదు అని నిరాశ పడతాం.

కాబట్టి పెళ్లి అనేది ప్రేమించి చేసుకున్నామా, పెద్దలు చూపిస్తే చూసి చేసుకున్నామా అనేదానికన్నా మనం పెళ్లి అనే పదాన్ని, పెళ్లి తో పాటు జీవితంలో వచ్చే మార్పులని అర్ధం చేసుకుంటే చాలు.  అలానే రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త బాధ్యతలు మీద పడతాయి కదా...అప్పుడు కదా అసలు జీవితం మొదలు అయ్యేది. ఆ టైంకి వచ్చేసరికి అది పెద్దలు కుదిర్చిన పెళ్లి ఆయినా, మనకు మనం కోరి చేసుకున్న పెళ్లి ఆయినా పరిస్థితి ఒకటే ఉంటుంది. ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని, బాధ్యతలు పంచుకునే మనస్తత్వం ఉంటే చాలు. భర్త వంద suprises ఇవ్వనవసరం లేదు..ప్రతీ వారంతం బయటకి తీసుకుని వెళ్ళక్కర్లేదు, ఆఫీసు పని, ఇంటి పని, పిల్లల పనితో సతమతమయిపోతున్న భార్యకి నేను ఉన్నాను అనే భరోసా, ఇది మన కుటుంబం, కలిసి బాధ్యతలు పంచుకుందాం అంటూ చేసే చిన్న చిన్న సాయాలు చాలు జీవితం సంతృప్తికరంగా సాగడానికి.

పెరుగుతున్న ఖర్చులతో, వచ్చే పరిమిత ఆదాయంతో, ఆఫీసు లో ఉన్నtensions తో, ఒత్తిడితో ఉన్న భర్తతో చిన్న చిన్న విషయాల్లో సర్దుకుపోతూ, అత్తింటి భాధ్యతలను సొంత ఇంటి భాధ్యతలు గా అర్ధం చేసుకుంటూ, , దొరికే కాసేపటి ఏకాంతంలో ఇరుగు పొరుగు విషయాలు, కంప్లైంట్స్ చెప్పకుండా సొంత కుటుంబం గురించి మనసు విప్పి మాట్లాడుకునే వాతావరణం కల్పిస్తే గృహమే కదా స్వర్గసీమ.

ఇవి అన్నీ ఈ చిన్న పిల్లలకి ఇప్పుడే తెలియాలి అనుకోవడం కూడా తప్పే కదా...మనకు మాత్రం ఇవ్వన్నీ ముందే తెలుసా...అక్కడికి వెళ్లి వస్తేనే కదా తెలిసేది. అందుకే ఎవరికీ తోచింది వాళ్ళు చెపుతూ ఉంటే, నేను వింటూ ఉన్నాను.

ఆఫీసులో ఈ డిస్కషన్ జరుగుతూ ఉండగానే ఒక అబ్బాయి చెప్పాడు. పురాణాల ప్రకారం ఐదు రకాల దంపతులు ఉంటారంట...లోకంలో ఏ దంపతులయినా ఈ ఐదింట్లో ఒక రకం వారు అయ్యి ఉంటారంట. అది కూడా చెప్తాను ఇక్కడ..

1 - లక్ష్మీ నారాయణులు
నారాయణుడు లక్ష్మికి హృదయంలో చోటు ఇచ్చాడు. అందువలన ఇద్దరూ ఒకరి పట్ల ఇంకొకరు విపరీతమయిన ప్రేమతో ఉంటారు. అన్నీ మనసు విప్పి చెప్పుకుంటారు కానీ ఒకరి విషయాల్లో ఇంకొకరు తల దూర్చరు, ఒకరి అవసరం ఇంకొకరికి వచ్చినప్పుడు వారి మీద ఉన్న ప్రేమతో చేసి పెడతారు కానీ, మామూలుగా అయితే ఎవరి విషయాలు వారే సొంతగా జరుపుకుంటారు.

2 - శివ పార్వతులు
శివుడు అర్ధ నారీశ్వరుడు కదా..తన దేహంలో సగ భాగం ఇచ్చాడు. ఆలోచన, మాట, మనసు, చేతలు, నడక, కష్టం, సుఖం అన్నీ కలిసి పంచుకుంటారు.  దాపరికాలు ఉండవు, ఏ పని చేసినా కలిసే చేస్తారు.

౩-బ్రహ్మ సరస్వతి
బ్రహ్మ నాలుక మీద స్థానం సరస్వతిది. భర్త మాటే తన మాట. ఎన్ని విషయల్లు మాట్లాడుకున్నా, ఎన్ని ఆలోచనలు పంచుకున్నా, ఎన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నా ఇద్దరి మాట ఒకటే....ఆ మాట భర్త నోటి వెంటే..

4 -సూర్యుడు-ఛాయ
సూర్యుడు అమితమయిన కాంతితో వెలిగిపోతూ ఉంటాడు. లోకం మొత్తానికీ సూర్యుడు, సూర్యుని శక్తి తెలుసు. ఛాయ కేవలం తనని అనుసరిస్తుంది. మాట, ఆలోచన, ఆచరణ అన్నీ సూర్యునివే. ఛాయ అన్నిటినీ అంగీకరుస్తూ, సూర్యుని కాంతిని స్వీకరిస్తూ సహజీవనం చేస్తుంది. Typical male dominated house.

5 - చంద్రుడు - రోహిణి
రోహిణి భగ భగ మండే మంట. చంద్రుడు చల్లని వెన్నెల దాత. ఆయినా వారి కాపురం సాఫీగానే సాగుతుంది ఎల్లప్పుడూ...  కారణం రోహిణికి ఎంత వేడి ఉందో, చంద్రునికి అంత చల్లార్చే శక్తి ఉంది. రోహిణి ఎంత మండినా చంద్రుని చల్లని చూపులే అందరికీ సుపరిచితం. ఒకరికి మండడం తెలిసినప్పుడు ఇంకొకరికి చల్లబరచడం తెలియాలి కదా..

హ్హి హ్హి హీ....మీరు ఏ విషయాల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు కొత్త పిల్లకాయలకి అని మాత్రం అడగకండి...ముందే చెప్పా కదా లంచ్ తర్వాత జరిగిన టైం పాస్ డిస్కషన్ అని.

2 comments:

Ram Krish Reddy Kotla said...

Nice discussion. Informative. After marriage, whether its love or arranged, how far they understand and compliment each other truly matters, isn't it? When a boy and girl in love, everything looks rosy and once they enter web-lock, the thorns below that rose starts to prick them. If their love doesn't yield to such pain, then they are gonna live happily and the same applies in arranged marriage too :-)

Rajitha Pedduri said...

Nice blog !! ee post chala baavundi